వైఎస్ఆర్ ఫోటో పెట్టుకోవడానికి కాంగ్రెస్కు సిగ్గుండాలె

వైఎస్ఆర్ ఫోటో పెట్టుకోవడానికి కాంగ్రెస్కు సిగ్గుండాలె

మెదక్: వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందంటూ వైఎస్ఆర్ కూతురు, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లు పార్టీ కోసం పని చేసిన తన తండ్రిని చనిపోయాక... దోషి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని మండిపడ్డారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కరడుగట్టిన కాంగ్రెస్ నేత అని, అయితే ఆయన మరణాంతరం కాంగ్రెస్ పార్టీ ఆయనకు తీరని ద్రోహం చేసిందని షర్మిల ఆరోపించారు. మండుటెండల్లో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ఆర్ తీవ్రంగా శ్రమించారని చెప్పారు. ఆ రెండు దఫాలు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డే కారణమని తెలిపారు. అలాంటి వ్యక్తి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే.. కనీసం దర్యాప్తు చేయించలేదని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.

వైఎస్ఆర్ బతికున్నప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన కాంగ్రెస్ పార్టీ...  చనిపోయాక ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఫోటో పెట్టుకొని ఓట్లు అడగడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మండిపడ్డారు. ఇవాళ వైఎస్ఆర్ బతికి ఉంటే తనను అంతలా అవమానించిన కాంగ్రెస్ పై ఉమ్మివేసేవారని చెప్పారు. వైఎస్ఆర్ మరణించిన తర్వాత కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉందని, కానీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. వైఎస్ఆర్ వారసురాలిగా తాను ప్రజల ముందుకు వచ్చానని, ఆశీర్వదిస్తే వైఎస్ఆర్ పాలనను తిరిగి తీసుకొస్తానని షర్మిల తెలిపారు.